పొత్తుని గెలిపిద్దాం- రాష్ట్రాన్ని కాపాడుకుందాం: ఆళ్ళ హరి

  • రాష్ట్రంలో మంచినీరు అడిగితే ప్రాణాలు తీసే అరాచకపాలన సాగుతోంది
  • ఎలాంటి క్రిమినల్స్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టారో ప్రజలు ఆలోచించాలి
  • నా యస్సిలు అంటూనే దళితుల ప్రాణాలు తీస్తున్న ముఖ్యమంత్రి
  • సంక్షేమం ముసుగులో లక్షల కోట్లు దోచుకున్న వైసీపీ నేతలు

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం: మల్లవరంలో మంచినీళ్లు పట్టుకునేందుకు వచ్చిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాణావత్ సామునిబాయ్ ని వైసీపీ నేత ట్రాక్టర్ తో ఢీ కొట్టి చంపటం అమానుషమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఎలాంటి క్రిమినల్స్ చేతిలో పెట్టారో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. శనివారం 22 వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసరావుతోట, వడ్డెర గూడెం, కార్మికుల కాలనీలో పొత్తుని గెలిపిద్దాం – రాష్ట్రాన్ని కాపాడుకుందాం కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాల గురించి, విధ్వంసమైన వ్యవస్థల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ మాట్లాడితే నా యస్సిలు అంటూ ముఖ్యమంత్రి నయవంచక ప్రేమను ఒలకపోస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సి ఎస్టీల ప్రాణాలకు వైసీపీ ప్రభుత్వంలో భద్రత లేదన్నారు. జగన్ రెడ్డి చిరునవ్వు వెనుక కనిపించని శాడిజం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి క్రిమినాలిటీని భరించలేక కన్న తల్లే అతన్ని విడిచి వెళ్లిపోయిందన్నారు. అధికారం కోసం బాబాయ్ ని చంపించినోడికి, ఆస్తి కోసం సొంత చెల్లిని తరిమేసినోడికి పేదల మీద ప్రేమ ఉంటుందనుకోవటం మన భ్రమ అన్నారు. ఒకవైపు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూనే మరోవైపు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడని మండిపడ్డారు. లక్షల కోట్ల అప్పు తెచ్చి కొంత పేదలకిచ్చి మిగతావి వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, పోరాట పటిమ ఉన్న యువ నాయకుడు పవన్ కల్యాణ్ ల నాయకత్వం రాష్ట్రానికి అవసరమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన చారిత్రక అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, జనసేన టీడీపీ నాయకులు సయ్యద్ షర్ఫుద్దీన్, షేక్ నాగూర్, ఆదాం, మిద్దె నాగరాజు, కోలా మల్లి, కొలసాని బాలకృష్ణ, నండూరి స్వామి, పోతురాజు, పగిడిపోగు రమేష్, చింతకాయల సాయి, రాసంశెట్టి బుజ్జి, వడ్డె సుబ్బారావు, సాధిక్, ఉదయ్ చంద్ర, షేక్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.