చిన్నారులను విద్యకు దూరం చేస్తున్న పాఠశాలల విలీనం: ఎస్ వి బాబు

ప్రాథమిక పాఠశాలను జడ్పీ స్కూల్లో విలీనం చేయడం ద్వారా 3,4,5 తరగతుల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. విద్యార్థులను బడికి దూరం చేయటం అంటే విద్యకు దూరం చేయడమేనని పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు అన్నారు.

సొంత గ్రామాల్లో పాఠశాలలను జిల్లా పరిషత్ పాఠశాలలో విలీనం చేయడం వలన ఇటు విద్యార్థులు, అటు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేదలు తమ పిల్లలను దూరప్రాంతాలకు పంపించాలంటే రవాణా ఖర్చులు అదనపు భారంగా మారనున్నాయి. అంతేకాకుండా కూలి పని చేసుకునే తమకు పిల్లలను స్కూలుకు వదిలి తీసుకురావడం సమస్యగా మారుతుందని వాపోతున్నారు.

పెడన నియోజకవర్గం లోని అనేక గ్రామాల్లో పాఠశాలను, ఉన్నత పాఠశాలలో విలీనం చేయటం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.

పెడనలోని రామలక్ష్మి వీవర్స్ కాలనీలో ఉన్న పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేయటాని కాలనీవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఇదే కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వేరేచోటకి మార్చడం జరిగింది. ఇప్పుడు కాలనీలో ఉన్న స్కూలు కూడా మార్చడం సరికాదు అని కాలనీవాసులు అంటున్నారు.

విద్యను దూరం చేసే పాఠశాల విలీన విధానాన్ని ప్రభుత్వం వెంటనే స్వస్తి పలకాలి. లేనియెడల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ఎస్ వి బాబు తెలియజేసారు.