న‌వ‌ర‌త్నాలలో నయా వంచన!

*అంగన్వాడీ కార్యకర్తలకు షాక్
* ఆదాయంతో కొత్తగా లంకె
* వేలాది మంది ల‌బ్దికి గండి
* జ‌గ‌న్ ప్ర‌భుత్వ దొడ్డిదారి విధానాలు
* ప‌థ‌కాల నిధుల ఆదాకు కుయ‌త్నాలు

‘అర‌టి ప‌ళ్లు పంచిపెడ‌తాం ర‌మ్మ‌ని పిలిచి, తీరా అనేక మంది వచ్చాక, నెత్తి మీద జుట్టు లేనివారికే ఇస్తామంటే… ఒక‌రిద్ద‌రికి త‌ప్ప చాలామందికి నిరాశే మిగులుతుంది క‌దా?’
స‌రిగ్గా అలాగే జ‌రుగుతోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల తీరు!
పాద‌యాత్ర‌లో ఊరూరా ఈ ప‌థ‌కాల పేరు చెప్పి ఊరించి, అధికారాన్ని కైవ‌శం చేసుకున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు కొత్త నిబంధ‌న‌లు పెడుతూ ల‌క్ష‌లాది మందికి ఇవి అమ‌లు చేయ‌క్క‌ర్లేకుండా త‌ప్పించుకునే కుయ‌త్నాలు సాగిస్తోంది.
న‌వ ర‌త్న ప‌థ‌కాల లబ్దిదారులకు ఆదాయ ప‌రిమితులు విధిస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఇలాంటిదే. ఇందువ‌ల్ల ప‌థ‌కాల‌పై వెచ్చించే కోట్ల రూపాయ‌ల‌ను ఆదా చేసుకునే అవ‌కాశం ప్ర‌భుత్వానికి క‌లుగుతోంది. ఈ ప‌రిమితుల ప్ర‌కారం చూస్తే ఓ కుటుంబం నెల‌వారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రూ.12 వేలు దాట‌కూడ‌దు. ఈ ప‌రిధి దాటిన వారు ఇకపై న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌కు అన‌ర్హుల‌వుతారు. ఇందువ‌ల్ల రాష్ట్ర‌వ్యాప్తంగా వేలాది మంది ప్ర‌జ‌లు ఒంట‌రి, వితంతు, దివ్యాంగ పింఛ‌న్ల‌కు సైతం దూర‌మ‌య్యే ప‌రిస్థితి నెల‌కొంది. ఎందుకంటే సాధార‌ణంగా పేద కుటుంబాల్లో ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక ప‌ని చేస్తూ ఎంతో కొంత సంపాదించుకుంటారు. ఒక‌రు కూలి ప‌నికెళితే, మ‌రొక‌రు పాచి పనికి వెళ‌తారు. ఒక‌రు మోత ప‌నిలో కుదిరితే, మ‌రొక‌రు ఏ పారిశుద్ధ్య ప‌నిలోనైనా చేర‌తారు. ఇలా ఏ ప‌ని చేసినా ఒకో వ్య‌క్తి నెల‌కు రెండు మూడు వేలు సంపాదించుకోవ‌డం స‌హ‌జ‌మే. ఓ కుటుంబంలో న‌లుగురు ఉన్నారనుకుంటే అంద‌రికీ కలిసి ప‌ది వేలు ఆదాయం రావ‌డం క‌ద్దు. అయినంత మాత్రాన అలాంటి కుటుంబాల వారు సుఖ‌మ‌య జీవ‌నం సాగిస్తున్నార‌ని చెప్ప‌లేం. ఏ నెల‌కానెల క‌డుపునిండా తిన‌డానికి కూడా ఆ సంపాద‌న క‌ట‌క‌ట‌లాడేలాగా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇలాంటి పేద కుటుంబాల వారు, ప్ర‌భుత్వం ఘనంగా ప్ర‌చారం చేసుకునే న‌వ ర‌త్నాల ప‌థ‌కాల ప‌రిధిలోకి రాకుండా పోతారు. దీని కార‌ణంగా ఒంట‌రి, వితంతు, దివ్యాంగ పింఛన్ల‌కు సైతం దూర‌మ‌య్యే వాళ్లు వేలాదిగా ఉంటారు.
‘న‌వ‌ర‌త్న ప‌థ‌కాలను ఘ‌నంగా ప్ర‌చారం చేసుకుని అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇలాంటి ఆదాయ ప‌రిమితుల‌ను విధించ‌డం ఏరుదాటాక తెప్ప త‌గ‌లెయ్య‌డం లాంటిదేన‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌లేక‌, దొడ్డి దారిన ఆ నిధుల‌ను ఆదా చేసుకోవ‌డానికి చూస్తోంద‌’ని అనేక మంది విశ్లేషిస్తున్నారు.
ప్ర‌భుత్వం విధించిన ఆదాయ ప‌రిమితి, రాష్ట్ర వ్యాప్తంగా అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్తలకు శ‌రాఘాతంగా మార‌నుండ‌డం తాజా ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగ‌న్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్ర‌తి కేంద్రానికి ఒక కార్య‌క‌ర్త, ఒక ఆయా ఉంటారు. వీరికి గౌర‌వ వేత‌నం ఉంటుంది. 2016 ఏప్రిల్ వ‌ర‌కు వీరి వేత‌నం కేవ‌లం రూ. 4200 మాత్ర‌మే. త‌ర్వాత రెండు విడ‌త‌ల్లో వీరి వేత‌నాన్ని 6,300 వ‌ర‌కు పెంచారు. అలా 2018 నాటికి ఇది 10,500 రూపాయ‌లైంది. గ‌త ప్ర‌భుత్వం వీరిని ఆదాయ ప‌రిమితి నిబంధ‌న నుంచి తొల‌గించ‌డంతో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు వీరికి ఎలాంటి ఇబ్బందీ క‌లగ‌లేదు. 2019లో అధికారం చేప‌ట్టిన వైకాపా ప్ర‌భుత్వం వీరి వేత‌నాన్ని వెయ్యి రూపాయ‌లు పెంచింది. కానీ తాజాగా వీరిని ఆదాయ పరిమితి పరిధిలోకి తీసుకువస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మ‌హిళా శిశు సంక్షేమ ప‌థ‌కం అన్ని సంక్షేమ శాఖ‌లు, గ్రామీణ పేదిరిక నిర్మూల‌న సొసైటీ, పంచాయితీ రాజ్‌, పుర‌పాల‌క శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ చేయ‌డంతో వీళ్లకు ఎలాంటి ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఫ‌లితంగా అన్ని ప‌థ‌కాలు, ఇళ్ల ప‌ట్టాలు, ఇళ్ల నిర్మాణ రాయితీల‌తో పాటు వితంతు, ఒంట‌రి మ‌హిళ‌, దివ్యాంగ పింఛ‌న్ల‌కు కూడా అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు దూరం కానున్నారు. నిజానికి ఆదాయ ప‌రిమితి అయిన రూ. ప‌దివేల‌కు అద‌నంగా వీరు పొందేది కేవ‌లం 1500 రూపాయ‌లు మాత్ర‌మే. అంటే ఏడాదికి రూ. 18 వేలు. అయితే ఈ ప‌రిమితి వ‌ల్ల వీరు కోల్పోయే ల‌బ్ధి మాత్రం వేల‌ల్లో, ల‌క్ష‌ల్లో ఉంటుంది. ఎందుకంటే ఓ అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త దివ్యాంగురాలైతే ఆమెకు నెల‌కు 3 వేల రూపాయ‌లు పింఛ‌న్ ల‌భించేంది. దాని విలువ ఏడాదికి రూ.36 వేలు. ఇంటి నిర్మాణ రాయితీ వ‌ర్తించ‌క‌పోతే రూ.1.8 ల‌క్ష‌ల మేర‌కు కోల్పోయిన‌ట్టే. ఇక ఇళ్ల ప‌ట్టా కూడా అంద‌క పోతే ల‌క్ష‌ల్లో ల‌బ్దిని కోల్పోయిన‌ట్టే. ఇక ఆమె పిల్ల‌ల‌కు విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన లాంటి ప‌థ‌కాలు కూడా అమ‌లు కావు. అంగ‌న్ వాడీ కేంద్రాల ద్వారా ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉంటూ కింది స్థాయిలో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అమ‌లు చేస్తూ సేవ చేసే దాదాపు 51 వేల‌కు పైగా అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు ఇది నిజంగా అశ‌నిపాతమే. ఇలా ఒక్క అంగ‌న్ వాడీల‌కే కాదు, వేర్వేరు కులాల్లో, వృత్తుల్లో అర‌కొర ఆదాయంతో జీవ‌నం నెట్టుకొచ్చే అనేక మంది పేద‌లు ఈ ఆదాయ ప‌రిమితి విధానం వ‌ల్ల ప్ర‌భుత్వ ప‌ర‌మైన సంక్షేమ ప‌థ‌కాల‌కు దూరం కానున్నారు. ఇది సంక్షేమ ప‌థ‌కాల సొమ్మును ఆదా చేసుకునే కుయ‌త్న‌మేన‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.