YCP దాష్టీకపు పాలనపై పోరాటానికి సిద్ధం

రాష్ట్రంలో వైకాపాది దౌర్భాగ్యపు, దిక్కుమాలిన, దాష్టీక పాలన. 151 మంది ఎమ్మెల్యేలతో మంచి పాలన అందిస్తారనుకుంటే దాడులు, బెదిరింపులతో పాలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండి ఈ దాష్టీక పాలనను ఎదుర్కోవాలని నిర్ణయించాం. ఇందుకోసం 27, 28 తేదీల్లో విజయవాడలో సమావేశమై చర్చించబోతున్నాం. పరిషత్తు ఎన్నికల్లో జనసేన మంచి గెలుపు సాధించింది. కులాలను కలిపే ఆలోచన మంచి ఫలితాలను ఇచ్చింది’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన గురువారం రాత్రి వీడియో సందేశం విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి…

* ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమై 1,209 మంది సర్పంచులు, 1,576 ఉప సర్పంచులు, 4,456 వార్డు సభ్యులను గెలుచుకున్నాం. పరిషత్తు ఎన్నికల్లో 1200 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసి 177 గెలుపొందాం. పంచాయతీ ఎన్నికల్లో 24% ఓట్లు సాధిస్తే పరిషత్తు ఎన్నికల్లో 25.2% సాధించాం. పోటీచేసిన, గెలిచిన స్థానాల ప్రాతిపదికగా ఈ విషయం చెబుతున్నాం. జడ్పీటీసీ స్థానాలు రెండు గెలుచుకున్నాం. ఇది మార్పునకు సంకేతం.

* ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయకపోతే పింఛన్‌ తీసేస్తామని రేషన్‌లో కోత కోస్తామని బెదిరించారు. మంత్రులే ఎన్నికల ప్రక్రియను నడిపించగా, ఎన్నికల కమిషన్‌ చోద్యం చూస్తూ ఉండిపోయింది. మిత్రపక్షం భాజపాకు కొన్ని స్థానాలు వదిలిపెట్టడంతో జనసేనకు కొన్ని సీట్లు తగ్గాయి.

* ఎన్నికలకు తాజా నోటిఫికేషన్‌ ఇచ్చి ఉంటే జనసేన 1500 పైచిలుకు ఎంపీటీసీలు, 40-80 జడ్పీటీసీలు గెలుచుకునేదని పరిశీలకులు చెబుతున్నారు. కొన్నిచోట్ల పోలీసులే బలవంతంగా అభ్యర్థులతో ఉపసంహరణలు చేయించారు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెద్ద కొండూరులో జనసేన అభ్యర్థి 65 ఓట్లతో గెలిస్తే వైకాపా నాయకులు ఒత్తిడి తెచ్చి రీ కౌంటింగు చేయించి 18 ఓట్ల తేడాతో ఓడిపోయేలా చేశారు. కడియం మండలం వీరవరంలో గెలిచిన జనసేన సంబరాలు చేస్తుంటే వైకాపా వారు దాడులు చేశారు. కొత్తపల్లి అయ్యప్ప గాయపడి ఇప్పటికీ ఆస్పత్రిలో ఉన్నారు.