చెరువుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించండి!

  • గౌరవ న్యాయస్థానం తీర్పును అమలు చేయాలి
  • నెల్లిచెరువు, లక్ష్మునాయుడు చెరువుల్లో జరుగుతున్న నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలి
  • కబ్జాదారులపై, సహకరించిన అధికారులపై కేసులు పెట్టండి
  • ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కోరిన జనసేన పార్టీ నాయకులు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు

చీపురుపల్లి: చెరువుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని జనసేన పార్టీ నాయకులు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఆయన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్ ను కలిసి పార్వతీపురం పట్టణంతో పాటు జిల్లాలో జరుగుతున్న చెరువుల కబ్జాలు, చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల కబ్జాలు, అక్రమ నిర్మాణాలు పట్ల గౌరవ న్యాయస్థానాలు తీర్పులు అమలు చేయాలన్నారు. వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. పార్వతీపురం పట్టణంలోని దేవుని బంద, లక్ష్మనాయుడు చెరువు, నెల్లిచెరువు, లంకెల చెరువు, కొత్తచెరువు, కోదువాని బంద, సంగం నాయుడు చెరువు, కామయ్య బంద, వరహాల గెడ్డ తదితర కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ చెరువులు, గెడ్డలు కబ్జాకు గురవుతున్నాయ న్నారు. గత కొంతకాలంగా ఈ కబ్జాలు జరుగుతున్నా ఆయా చెరువుల్లో పక్కా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత ఇరిగేషన్, మున్సిపాలిటీ, రెవెన్యూ, సచివాలయ అధికారులు సిబ్బంది నివారణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీంతో కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలు చెరువులు, గెడ్డలు అక్రమార్కుల చేతిలోకి వెళుతున్నాయన్నారు. కాబట్టి ఆయా చెరువులు ప్రభుత్వ స్థలాలకు సర్వే చేయించి, సరిహద్దులు ఏర్పాటు చేయాలన్నారు. ఆక్రమణలు కబ్జాలకు పాల్పడిన వారిపై, అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే చెరువులు కబ్జాకు గురైన కాలంలో వాటిని నివారించని ఆయా శాఖల అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆయా చెరువుల్లో గెడ్డల్లో నిర్మించిన భవనాలను, కట్టడాలను తొలగించాలన్నారు. కనీసం అధికారికంగా చెరువుల్లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని ఐటిడిఏ పిఓ అన్నారు.