అప్రకటిత విద్యుత్తు కోతలు నివారించాలి: గురాన అయ్యలు

విజయనగరం: ప్రభుత్వం అప్రకటిత విద్యుత్‌ కోతలు అమలు చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని జనసేన నేత గురాన అయ్యలు ఆరోపించారు. అనధికార విద్యుత్ కోతల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం స్పందనలో జనసేన పార్టీ తరుపున జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా గురాన అయ్యలు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ముందస్తు సమాచారం లేకుండా మూడు గంటలకు పైగా విద్యుత్‌ కోతలు అమలు చేయడం భావ్యం కాదన్నారు.
వైకాపా ప్రజా ప్రతినిధులు అధికారానికి వచ్చిన నాటి నుంచి అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణ, కాంట్రాక్టుల్లో కమీషన్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పరి ష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల అనేక సమ స్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్పప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవటం దారుణమన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు కష్టాలు తప్పటం లేదన్నారు. గృహ వినియోగదారుల నుంచి యూనిట్‌కి ఒక రూపాయ నుంచి రెండు రూపాయలకు పైగా విద్యుత్‌ బిల్లులు అదనపు ఛార్జీల పేరిట భారీగా వసూళ్లు చేస్తున్న ప్రభుత్వానికి నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని ఈ అనధికార విద్యుత్‌ కోతలు ఏమిటని విద్యుత్‌ సిబ్బందిని ప్రశ్నిస్తే సమాధానం రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనధికార విద్యుత్‌ కోతలు నివారించకపోతే సబ్‌ స్టేషన్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టి.రామకృష్ణ, డి.రామచంద్రరాజు, కాటం అశ్వని, మాతా గాయిత్రి, చక్రవర్తి, ఎల్. రవితేజ, పిడుగు సతీష్, రవీంద్ర, ఎమ్. పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, దుర్గారావు, సుంకరి వంశీ, సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.