పెడనలో రోడ్డెక్కిన నేతన్నలు

పెడన, వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేతన్నలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పనులు సరిగా లేక, నేసిన వస్త్ర నిల్వలు సంఘాల వద్ద పేరుకుపోవడం వల్ల నేతన్నలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. పెడన నియోజకవర్గంలో నేతన్నలు సాంప్రదాయబద్ధమైన తమ వృత్తిని నమ్ముకుని జీవిస్తారు. వీరు వేరే వృత్తిలోకి మారలేరు. చేనేత పరిశ్రమకు సంఘాలు ఆయువుపట్టు, సంఘాల్లో అనేక అవకతవకలు జరగటం వల్ల, నేత వృత్తిని నమ్ముకున్న కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. స్థానిక బ్రహ్మపురంలో గల సదా శివలింగేశ్వర చేనేత సహకార సంఘంలో భారీగా నిధులు గోల్ మాల్ అయ్యాయి. జౌళి శాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉండటం వల్ల, కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఒకపక్క సంఘం పని కల్పించడం లేదు. మరోపక్క చేసిన పనికి మజూరు(వేతనాలు) లేవు. ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం అని నేతన్నలను దగా చేస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక రాయితీలను సకాలంలో చెల్లించకపోవడంతో మొత్తం పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమైంది. మంగళవారం బ్రహ్మపురంలోని శ్రీ సదాశివ లింగేశ్వర చేనేత సహకార సంఘం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఇదే విధమైన దీక్ష చేయగా ప్రభుత్వము మాయమాటలు చెప్పి దీక్షను విరమింపచేసింది. కానీ కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదు. మంత్రి జోగి రమేష్ ఆఫీస్ కి కూతవేటు దూరంలో దీక్ష జరుగుతున్నప్పటికీ మంత్రి గాని, స్థానిక వైసిపి నాయకులు గానీ ఎవరూ పట్టించుకోకపోవడం చేనేత కార్మికులపై వైసీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. తక్షణమే మంత్రి జోగి రమేష్, జౌళి శాఖ అధికారులు స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిందిగా జనసేన పార్టీ బలంగా డిమాండ్ చేస్తుంది. లేని ఎడల త్వరలో చేనేత కార్మికుల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటానికి జనసేన పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.