ముఖ్యమంత్రి పర్యటన ఉంటే ప్రైవేటు స్కూళ్లకు సెలవులేంటి?

  • స్కూలు బస్సుల్లో జనం తరలింపుకే సెలవులు
  • ఇది అధికారుల అత్యుత్సాహమా? అధికార పార్టీ అదేశాలా?
  • అధికారుల నిర్లక్ష్యమే సభలో మహిళ మృతికి కారణం
  • జనాల తరలింపుపై మంత్రి జోగి వివరణ ఇవ్వాలి
  • మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి
  • గోపాలమిత్రలను సభకు పిలిచి అరెస్టులు చేయడమేంటి?
  • జనసైనికుల ముందస్తు అరెస్టుల్ని ఖండిస్తున్నాం.

పెడన, ముఖ్యమంత్రి వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉంటేనే ప్రజలు సుఖంగా ఉన్నట్టున్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గెలిచాక ప్రజల కష్టాలు పట్టించుకోవడం మానేశారని బాధ్యత గల ప్రతిపక్షంగా బాధ్యత గుర్తు చేశాం. జనసేన విమర్శలకు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని నొక్కి ముఖ్యమంత్రి.. ఇప్పుడు అదే బటన్లు నొక్కే నెపంతో భారీ భద్రత మధ్య బయటికి వస్తున్నారు. బటన్ రెడ్డి పర్యటనలతో ప్రజల పరిస్థితి పాఠం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా తయారయ్యింది, ముఖ్యమంత్రి పర్యటనలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. సీఎం పర్యటనలు ఉన్న జిల్లా మొత్తం స్కూళ్లకు సెలవులు ఇచ్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కింది. సభలకు స్వచ్ఛందంగా జనం రాక. జనాన్ని తరలించేందుకు ప్రైవేటు స్కూళ్లకు సైతం సెలవులు ఇవ్వడం ఏంటి? ముఖ్యమంత్రి బయటకి వస్తే పిల్లలు స్కూళ్లకు వెళ్ల కూడదా? ఓ వైపు ఇష్టారాజ్యమైన విద్యావిధానాలతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు సీఎం టూర్లు అంటూ సెలవులు ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవహారంపై గౌరవ విద్యాశాఖ మంత్రి బొత్స సత్తిబాబు స్పందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి మెప్పు కోసం పరిమితికి మించి జన సమీకరణ చేపట్టి ఓ మహిళ మృతికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలి. మంత్రి జోగి రమేష్ ఈ దురదృష్టకర ఘటనకు బాధ్యత వహించాలి. వృద్ధ మహిళ ఊపిరిసలపక సొమ్మసిల్లి పడిపోతే అంత పెద్ద సభలో అత్యవసర వైద్యం చేసే దిక్కులేదా? ఆంబులెన్స్ ఎందుకు అందుబాటులో లేదు? ఊపిరి సలపని పరిస్థితుల్లో మృతి చెందిన మహిళ శ్రీమతి సమ్మెట రత్నమాణిక్యమ్మ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

• సమస్యలు చెప్పుకునే వీలు లేదా?

పాదయాత్రలో నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేశారు. గోపాలమిత్రలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. మూడేళ్ల పాలన గడచినా మీ హామీని నిలబెట్టుకోలేదన్న విషయాన్ని గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తే.. వారిని అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పారు. ప్రజలెవరూ మీకు సమస్యలు చెప్పుకోరాదా? సమస్యలు పరిష్కరించే మనసు ఈ ముఖ్యమంత్రికి లేదు. ఇప్పటికే మీ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు చీ కొడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకుల స్వేచ్ఛను హరిస్తారా? మీ దృష్టిలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు మనుషులు కాదా? ప్రజా సమస్యల మీద ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇస్తే తప్పు.. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా రోడ్డు మీదకు వస్తే తప్పు. చివరికి ఇంట్లో ఉన్నా తప్పే అన్న చందంగా మరీ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. పెడన నియోజకవర్గంలో జనసైనికుల్ని అకారణంగా అరెస్టు చేసి స్టేషన్ కి తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నాయకులు ప్రజా తిరుగుబాటును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నామని పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రాం సుధీర్ అన్నారు.