మీ భయం మీ మాటల్లో కనిపిస్తోంది శ్రీ జగన్ రెడ్డి గారూ…

తణుకు, కౌలు రైతులకు పాస్ పుస్తకాలు ఉండవని కూడా తెలియని ముఖ్యమంత్రి మీరు అన్నింట్లో మోసం.. మాట తప్పడం మీ నైజం
కులాలను చూసి రైతులకు సాయం చేస్తున్న ప్రభుత్వం ఇది తణుకు మీడియా సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు. కౌలు రైతు భరోసా యాత్రకు వస్తున్న స్పందన చూసి ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని, అందుకే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ వారికి ఆర్థిక సాయం చేస్తుంటే… వాళ్లసలు కౌలు రైతులే కాదని మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి విడతగా 41 మంది కౌలు రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాం. అందులో ఏ ఒక్కరైనా కౌలు రైతు కాదని అధికార పార్టీ నాయకులు నిరూపిస్తే గుండు గీయించుకుంటామని, లేని పక్షంలో మీరు గుండు గీయించుకుంటారా? అని సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ… “ ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిపోయింది. సీబీఐ దత్తపుత్రుడు ఈ మధ్యన ఏ ప్రాంతంలో సభ పెట్టినా ప్రజలకు ఏం చేశాం అని చెప్పుకోకుండా జనసేన పార్టీ మీద.. పవన్ కళ్యాణ్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు తిరిగి విమర్శల దాడి మొదలుపెట్టగానే ఆ అలజడిలో ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారు. నిన్న గణపవరం రైతు భరోసా సభలో కూడా నోటికొచ్చినన్ని అబద్ధాలు చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పథకం కింద రూ.13,500 ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్ర ఇస్తున్న నిధులతో కలిపి చెప్పామని మాట మార్చారు. వాస్తవంగా వైసీపీ చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కలుపుకొంటే ప్రతి రైతుకు రూ.19,500 రావాలి. కానీ ఇస్తున్నది రూ.13,500 మాత్రమే. అంటే ఒక్కో రైతు మీదా రూ.6 వేలు జగన్ ప్రభుత్వం మిగుల్చుకుంటోంది. ముఖ్యమంత్రికి తెలుగు మాట్లాడమే కాదు, అసలు అర్ధం కాదు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నవారికి ఎవరికైనా పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం చేశారా? అని ముఖ్యమంత్రి అడుగుతున్నారు. మేము ఆర్థికసాయం చేస్తుంది కౌలు రైతు కుటుంబాలకు. వాళ్ల దగ్గర ఎందుకు పట్టదారు పాస్ పుస్తకాలు ఉంటాయి? భూయజమానుల వద్ద మాత్రమే పాసు పుస్తకాలు ఉంటాయి. సీసీఆర్సీ కార్డుల పంపిణీ కూడా ఈ ప్రభుత్వం మొక్కుబడిగా చేసింది.

మేము ఆనాడు ప్రశ్నించడం వల్లే…

కౌలు రైతు అంటనే భూమి లేని పేద అని అర్ధం.. అలాంటి వారికి ఈ ప్రభుత్వం కులాలను అంటగట్టింది. కౌలు రైతు ఒ.సి. అయితే ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. 2014 నుంచి 2019 వరకు ప్రశ్నించని జనసేన పార్టీ ఇప్పుడెందుకు మాట్లాడుతుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మేము అప్పుడు ప్రశ్నించబట్టే టీడీపీ ప్రతిపక్షంలో, వైసీపీ అధికార పక్షంలో ఉంది. ఇప్పుడు కూడా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టే మీరు రోడ్డెక్కి ప్రజల మధ్య తిరుగుతున్నారు. లేదంటే వాళ్లకు అందనంత ఎత్తులో ఒక బటన్ నొక్కి వెళ్లిపోయేవారు. ప్రజలకు మంచి జరుగుతుంది అంటే జనసేన పార్టీ ఎవరినైనా ప్రశ్నిస్తుంది. ఎవరినైనా ఎదురిస్తుంది. ప్రజలకు మంచిచేస్తే గౌరవిస్తాం. తప్పుచేస్తే విమర్శిస్తాం. బెదిరిస్తే మాత్రం తాటతీస్తాం.

మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు… మరి మీకో…?

మేము బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రులకు, పెద్దవాళ్ళకి చెప్పి వెళ్తాం. మరి ముఖ్యమంత్రి బయటకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరికి దత్తపుత్రుడో..? ఈ సీబీఐ దత్తపుత్రుడు చెప్పేవన్నీ అబద్ధాలే. జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని జులైకు ఎందుకు మార్చారు. ఇలా జులైకు మార్చడం వల్ల ఒక ఏడాది అమ్మఒడి పథకాన్ని లేపేశారు. మద్యపాన నిషేధం అన్నారు. ఇప్పుడు దాన్నే ఆదాయ వనరుగా చూపించి అప్పులు తెచ్చుకుంటున్నారు. పంచాయతీలకు వస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నారు. చివరకు శవాల మీద చిల్లర ఏరుకునే విధంగా కరోనాతో చనిపోయిన బాధిత కుటుంబాలకు కేంద్రం ఇచ్చిన రూ. 1100 కోట్ల నష్టపరిహారాన్ని వాడేసుకున్నారు. అలాంటి మీరా జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర గురించి మాట్లాడేది. అన్నం పెట్టే అన్నదాతలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రతి కుటుంబానికి లక్ష చొప్పున ఇస్తున్నారు. జగన్ ఈ మూడేళ్లలో ఎవరికైనా వెయ్యి రూపాయలు విరాళంగా ఇచ్చారా? కష్టం తెలిసిన వారు కాబట్టే పవన్ కళ్యాణ్ ప్రజలను కడుపులో పెట్టి చూసుకుంటుంటే ఆ ప్రజల కడుపులు కొట్టి మీరు దోచుకుంటున్నారు.

ఎవరు ఎవరికి అమ్ముడుపోయారు ?

ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఆ హామీ ఏమైంది? విద్యార్ధుల ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని ఎందుకు తీసేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఎందుకు చేయలేకపోయారు? ఇసుకను ఆన్ లైన్లో ఎందుకు అమ్మడం లేదు? చెత్తపన్ను, ఇంటిపన్నులు పెంచింది ఎవరు? రాజ్యసభ సీటును రాష్ట్రం కోసం పోరాడే వాడికి కాకుండా అంబానీ చెప్పాడని పరిమళ్ నత్వానీకి ఎవరిచ్చారు? ఇప్పుడు చెప్పు ఎవరూ ఎవరికీ అమ్ముడుపోయారు? ఇప్పటికైనా ముఖ్యమంత్రి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం. ప్రజల పల్లకీ మోయడానికి జనసేన పార్టీ ఎంతదూరమైనా వెళ్తుంది” అన్నారు. ఈ సమావేశంలో పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్, తణుకు ఇంఛార్జి విడివాడ రామచంద్రరావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.