వంశధారపై బ్యారేజ్ నిర్మాణం కోసం ఒడిశాకు వైఎస్ జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మించబోతోంది. వంశధార నదిపై బ్యారేజ్ నిర్మాణం ద్వారా వేలాది ఎకరాల్ని సాగులోకి తీసుకురావాలని సంకల్పించింది. బ్యారేజ్ నిర్మాణానికి సహకారం కోరుతూ ఒరిస్సా ముఖ్యమంత్రికి వైఎస్ జగన్ లేఖ రాశారు.

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటోంది. ప్రతియేటా లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో పోతోంది. ఈ నేపధ్యంలో వంశధార నది నీటిని ఒడిసిపట్టేందుకు, సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. వంశధార నదిపై నేరడి బ్యారేజ్  నిర్మాణం తలపెట్టింది. దీనికోసం ఒడిశా ప్రభుత్వ సహకారం కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు.

నేరడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా ఒడిశా రైతులకు సైతం లబ్ది చేకూరుతుందన్నారు జగన్. ఈ బ్యారేజ్ వల్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, ఒడిశాలోని గణపతి జిల్లా రైతులకు ఉపయోగం ఉంటుందన్నారు. సముద్రంలో వృధాగా పోయే 80 టీఎంసీల నీటిని నేరడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా వినియోగంలో తీసుకురావచ్చన్నారు. దీనికోసం నవీన్ పట్నాయక్  సహకారం కోరారు